
- అదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించిన ప్రధాని
- మన సాయుధ బలగాలకు సెల్యూట్
- ఆర్మీ, నేవీ, వాయుసేన కోఆర్డినేషన్ అద్భుతం
- మన ఆడబిడ్డల సిందూరం తుడిచినోళ్లను మట్టిలో కలిపేశాం
- శత్రువుల చెవుల్లో ‘భారత్ మాతా కీ జై’ నినాదం మారుమోగింది
- మన డ్రోన్లు, మిసైళ్ల స్పీడ్ చూసి.. పాక్ కు నిద్రలేని రాత్రులు
- శాంతిని కోరుకుంటం.. కానీ దాడి చేస్తే అంతు చూస్తమని హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టామని.. ఇకపై పాక్ గడ్డపై నుంచి టెర్రర్ దాడులు కొనసాగితే ఆ దేశం వినాశనాన్ని కొనితెచ్చుకున్నట్టేనని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌తో పాక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ లక్ష్మణ రేఖను గీసింది. అది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు భారత్‌పై మళ్లీ దాడి చేస్తే.. పక్కాగా జవాబు ఇస్తం. ఆపరేషన్ సిందూర్ భారత నూతన విధానానికి నాంది పలికింది.
ఈ ఆపరేషన్ లో ప్రతి భారతీయుడూ గర్వంతో ఉప్పొంగిపోయేలా మన జవాన్లు అపూర్వమైన, అనూహ్యమైన, అద్భుతమైన విజయం సాధించారు. మన సోల్జర్ల శౌర్య, పరాక్రమాలు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా’’ అని ప్రధాని అన్నారు. భారత వాయుసేకు చెందిన పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మంగళవారం ఉదయం ఆకస్మికంగా అక్కడ పర్యటించారు.
ముందుగా ఎయిర్ బేస్ కు చేరుకున్న మోదీ అక్కడ కలియతిరుగుతూ జవాన్లను పలకరించారు. ఈ సందర్భంగా జవాన్ల ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ఎయిర్ బేస్ అంతా హోరెత్తింది. అనంతరం ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం, ఫైటర్ జెట్ లు బ్యాగ్రౌండ్ లో కనపడేలా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి సైనికులను ఉద్దేశించి 27 నిమిషాలపాటు మోదీ ప్రసంగించారు.
అదంపూర్ ఎయిర్ బేస్ ను, అక్కడ ఉన్న మిగ్ 29 ఫైటర్ జెట్ లను, ఎస్400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పేల్చివేశామని పాక్ చెప్పుకున్న నేపథ్యంలో ప్రధాని ఇలా ఫైటర్ జెట్ లు, ఎస్400 సిస్టమ్ ముందు నుంచి ప్రసంగించి, పాక్ ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టారు. ఈ సందర్భంగా త్రిశూల్ చిహ్నంతో కూడిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ట్రేడ్ మార్క్ టోపీని ప్రధాని ధరించారు. మోదీ ప్రసంగం సాగుతున్నంత సేపూ సోల్జర్లు ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మన బలగాల కోఆర్డినేషన్ అద్భుతం..
ఆపరేషన్ సిందూర్ లో మన సాయుధ బలగాల మధ్య కోఆర్డినేషన్, ఆధునిక ఆయుధాలను, మ్యాన్ పవర్ ను వినియోగించిన తీరు అద్భుతమని ప్రధాని మోదీ కొనియాడారు. ‘‘ఆకాశ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్, ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో శత్రువులు ప్రయోగించిన మిసైళ్లను తుత్తునియలు చేయగలిగాం. మిలిటరీలో మన సత్తా, ఆధునిక టెక్నాలజీ ముందు ఇక పాక్ ఏమాత్రం సరితూగలేదు. గత దశాబ్ద కాలంలో ఇండియన్ మిలిటరీకి ప్రపంచంలోనే అధునాతన టెక్నాలజీలను అందించగలిగాం.
పాక్ అణు బూచిని మన బలగాలు తుత్తునియలు చేయడంతో.. మన శత్రువులకు ‘భారత్ మాతా కీ జై’ నినాదం ప్రాధాన్యత తెలిసివచ్చింది. భారత్ మాతా కీ జై అనేది కేవలం నినాదం కాదు. మన సోల్జర్లు దేశం కోసం తమ జీవితాలను పణంగా పెడుతూ చేసే ప్రతిజ్ఞ. ఎప్పుడైతే మన డ్రోన్లు, మిసైల్స్ శత్రువుల స్థావరాలను తాకాయో.. అప్పుడు వారి చెవుల్లో భారత్ మాతా కీ జై అనే నినాదం మారుమోగి ఉంటుంది” అని మోదీ అన్నారు.
శాంతిని కోరుకుంటం, కానీ..
నాలుగు రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలను, 8 మిలిటరీ బేస్ లను ధ్వంసం చేయడంతోపాటు వందకుపైగా టెర్రరిస్టులను హతమార్చిన మన బలగాలు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించాయని ప్రధాని కొనియాడారు.‘‘భారత సైన్యం ధైర్య సాహసాల గురించి కొన్ని దశాబ్దాల తర్వాత కూడా చెప్పుకోదగ్గ రీతిలో మీరంతా ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారు. నేటి తరానికి మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాలకూ మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకే ఈ ఉదయం నేను మీ దర్శనం కోసం వచ్చా” అంటూ సోల్జర్లకు ఆయన సెల్యూట్ చేశారు. ‘‘ఇది న్యూ ఇండియా. శాంతిని కోరుకుంటుంది.
కానీ మానవత్వంపై దాడి జరిగితే యుద్ధరంగంలో శత్రువును ఎలా మట్టి కరిపించాలో కూడా తెలుసు. ఆపరేషన్ సిందూర్ సాధారణ ఆపరేషన్ కాదు. ఇండియా కొత్త విధానం, లక్ష్యం, నిర్ణయాత్మక సామర్థ్యం కలగలిపిన త్రిశక్తి ఇది. ఇది శాంతి దూత బుద్ధుడు నడయాడిన నేల మాత్రమే కాదు.. శత్రువుల పీచమణిచేందుకు సిక్కు ఆర్మీని తయారు చేసిన గురుగోబింద్ సింగ్ పుట్టిన నేల కూడా” అని ప్రధాని చెప్పారు.
మన డ్రోన్లు, మిసైళ్ల స్పీడ్ చూసి బిత్తరపోయారు..
ఇండియా నుంచి డ్రోన్లు, మిసైల్స్ దూసుకు వచ్చిన వేగాన్ని చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడుపుతోందని ప్రధాని అన్నారు. గగనతలంలో పౌర విమానాలను రక్షణ కవచంలా వాడుకోవాలని పాక్ ప్రయత్నించినా.. మనం మాత్రం పౌర విమానాలకు ఎలాంటి నష్టం కలగకుండానే టార్గెట్లను ధ్వంసం చేయగలిగామని చెప్పారు. మనం పాక్ లోని టెర్రర్, మిలిటరీ బేస్ లను మాత్రమే కాదు.. వారి అపవిత్రమైన ఉద్దేశాలను, దుస్సాహసాలను కూడా ధ్వంసం చేశామన్నారు.
‘‘అదంపూర్ తో సహా ఇతర ఎయిర్ బేస్ లపై దాడి కోసం పాక్ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ మన శక్తిమంతమైన డిఫెన్స్ వ్యవస్థ ఆ ప్రయత్నాలను భగ్నం చేసింది. నేను ఈ సందర్భంగా దేశానికి సందేశం ఇస్తున్నా. అణ్వస్త్రాల బూచిని చూపి పాక్ చేసే బ్లాక్ మెయిల్ కు ఇండియా ఇక బెదరదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, తగిన రీతిలో దీటుగా జవాబు చెప్తుంది” అని మోదీ హెచ్చరించారు.
పాక్‌కు 100 కి.మీ. దూరంలోనే..
పాక్ బార్డర్ కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అదంపూర్ ఎయిర్ బేస్ దేశంలోనే రెండో అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇక్కడ రఫేల్, మిగ్ 29 స్క్వాడ్రన్లు ఉంటాయి. ఆపరేషన్ సిందూర్ లో ఎస్400 మిసైల్ డిఫెన్స్ సిస్టం కూడా ఇక్కడి నుంచే శత్రు మిసైళ్లు, డ్రోన్ల పని పట్టింది. అలాగే 1965, 1975లో పాక్‌తో జరిగిన యుద్ధాల్లోనూ అదంపూర్ ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది.
సిందూరం తుడిచినోళ్లను మట్టిలో కలిపేశాం..
ధర్మ స్థాపన కోసం ఆయుధాలు చేతపట్టడం భారతీయ సంప్రదాయమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘మన అక్కాచెల్లెండ్లు, కూతుళ్ల సిందూరాన్ని చెరిపేసిన టెర్రరిస్టులను వారి స్థావరాల్లోనే మట్టిలో కలిపేశాం. దీంతో ఇండియాపై దాడి చేస్తే.. వినాశనాన్ని కొనితెచ్చుకున్నట్టేనని టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నవారికి అర్థమైంది. ఇకపై అమాయకులను చంపేవాళ్లకు మిగిలేది వినాశనం మాత్రమే. పాకిస్తాన్ బలగాలు తమను రక్షిస్తాయని టెర్రరిస్టులు అనుకున్నారు. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ బలగాలు పాక్ బలగాలను మోకాళ్లపై కూర్చోబెట్టాయి. పాకిస్తాన్ లో టెర్రరిస్టులకు సేఫ్ ప్లేస్ అనేదే లేదన్న సందేశం పంపాయి. మనం వాళ్లను వాళ్ల కలుగుల్లోనే హతమార్చగలం. పారి పోయేందుకు అవకాశమే ఇవ్వం” అని ప్రధాని అన్నారు.
ఇది న్యూ ఇండియా. శాంతిని కోరుకుంటుంది. కానీ మానవత్వంపై దాడి జరిగితే యుద్ధరంగంలో శత్రువును ఎలా మట్టి కరిపించాలో కూడా తెలుసు. ఆపరేషన్ సిందూర్ సాధారణ ఆపరేషన్ కాదు. ఇండియా కొత్త విధానం, లక్ష్యం, నిర్ణయాత్మక సామర్థ్యం కలగలిపిన త్రిశక్తి ఇది. ఇది శాంతి దూత బుద్ధుడు నడయాడిన నేల మాత్రమే కాదు.. శత్రువుల పీచమణిచేందుకు సిక్కు ఆర్మీని తయారు చేసిన గురుగోబింద్ సింగ్ పుట్టిన నేల కూడా.- ప్రధాని మోదీ